prev next

Friday 15 May 2020

దేవుడి చిరునామా

Posted on 07:08 by Vennaravi

కాశీ వెళ్లే ఓ రైల్లో తమ ఎదురు ప్రయాణీకుడైన ఓ సన్యాసి భగవద్గీత ని చదువు కోవడం చూశాడో నాస్తికుడు . " స్వామీ ! నిజంగా దేవుడున్నాడంటారా ? " కాలక్షేపానికి ప్రశ్నించాడు అతను . సాధువు తల ఎత్తి అతని వంక చూసి..ఉన్నాడన్నట్లుగా మౌనంగా తల ఊపి మళ్లీ గీతని చదువుకోసాగాడు . " దేవుడ్ని చూడాలని నాకు బాగా కుతూహలంగా ఉంది . దయచేసి ఆయన చిరునామా చెప్తారా ? " పరిహాసంగా అడిగాడు అతను . అది గుర్తించి , పుస్తకం మూసి ఆ సన్యాసి చెప్పాడు . " నీకో కధ చెప్తా విను . అది నీ సందేహం తీర్చచ్చు . పూర్వం ఓ ఊళ్ళో ఓ అమ్మాయికి ఆమె తల్లిదండ్రులు తమ పక్కింటి యువకుడితో వివాహం చేయాలనుకున్నారు . ఆమె అందుకు ఒప్పుకోలేదు . నేను పెళ్ళంటూ చేసుకుంటే అందరిలోకి గొప్పవాడినే చేసుకుంటాను తప్ప మన పక్కింటిలాంటి వాడిని చేసుకోను " . చెప్పిందా పిల్ల . " ఎవర్ని చేసుకుంటావయితే ? " ప్రశ్నించింది తల్లి . " మన ఊళ్ళో అందరికంటే గొప్పవాళ్లెవరు ? " ఆడిగిందా అమ్మాయి . " మన ఊళ్ళో ఏం ఖర్మ ? మన దేశం.లోని అందరికంటే గొప్పవాడు రాజు గారు " చెప్పాడు తండ్రి . " అయితే ఇంకేం ? ఆయన్నే చేసుకుంటాను . " చెప్పిందా పిల్ల . అది కుదరదని ఎంత చెప్పినా వినలేదా అమ్మాయి . తండ్రికి ఏమి చెయ్యాలో తెలీక ' సరే ' అన్నాడు . ఆ పిల్ల రాజధానికి చేరుకుంది . ఓ పల్లకీలో ఊరేగుత్తూ ఆ రాజు గారు ఆమెకు ఎదురు పడ్డాడు . ' నన్ను పెళ్లి చేసుకో ' అని అడగబోతుండగా , ఆ రాజు పల్లకి దిగి కాలినడకన వెళ్లే ఓ సన్యాసీ పాదాలకి సాష్టాంగ నమస్కారం చేయటం చూసింది . " ఈ సన్యాసి రాజుకంటే గొప్పవాడు కాకపోతే ఎందుకతనికి నమస్కరిస్తాడు ? ' అని ఆలోచించి ఆమె సన్యాసినే వివాహం చేసుకోవాలనుకుంది .. అతని దగ్గరకు వెళ్లి . ఆ.విషయం అడగబోతుండగా అతను రోడ్డుప్రక్కన ఉన్న ఓ వినాయకుడి గుడి ముందు నిలబడి మూడు గుంజీలు తీయటం చూసింది . ' ఈ సన్యాసి కన్నా ఆ వినాయకుడే గొప్ప . చేసుకుంటే వాల్లే చేసుకోవాలి ' అనుకుని ఆ అమ్మాయి లోపలికి వెళ్ళింది . ఇంతలో ఓ కుక్క వచ్చి ఆ విగ్రహం ముందు కాలెత్తి దాన్ని అపవిత్రం చేసింది . అప్పుడామె ఆ వినాయకుని కన్నా ఆ కుక్కే శ్రేష్ఠం అయి ఉంటుందని భావించి దాన్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటుండగా , ఓ పిల్లవాడు రాయితో ఆ కుక్కని కొట్టాడు . అది కుయ్యోమంటూ పరిగెత్తింది . ఇది చూసిన ఆ అమ్మాయి ఆ పిల్లవాడు గొప్పవాడనుకొని వాగ్గే పెళ్లి చేసుకోవాలనుకుంది . కానీ ఇంతలో ఓ యువకుడు వచ్చి ఆ పిల్లవాడి చెవిని నులిమి వాణ్ణి మందలించాడు . దాంతో తాను చూసిన అందరికన్నా ఆ యువకుడే గొప్పవాడనుకొని వాడి దగ్గరకు వెళ్లి తనని వివాహం చేసుకోమని అడిగింది . ఆ యువకుడు ఎవరో కాదు . ఆమె తల్లిదండ్రులు కుదిర్చిన పక్కింటి యువకుడే " . కధ పూర్తయ్యాక ఆ సన్యాసి చిన్నగా నవ్వుతూ తన ఎదుటి ప్రయాణీకుడితో చెప్పాడు . " మన హృదయం ఆ అమ్మాయి ఉన్న గ్రామం లాంటిది . దేవుడికోసం ఎక్కడెక్కడో వెతికినా చివరికి మన హృదయాంతరాల్లోనే దేవుడు ఉన్నాడు అని తెలుస్తుంది . అక్కడ తప్ప ఇంకెక్కడ వెతికినా దేవుడు దొరకడు . అదే దేవుని చిరునామా " .

Source: Helo App నుండి సేకరించబడినది